- యాదాద్రి జిల్లా భువనగిరి శివారులో ప్రమాదం
యాదాద్రి, వెలుగు : లారీని కారు ఢీకొనడంతో తల్లీకూతురు చనిపోగా, మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ శివారులో గురువారం జరిగింది. భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రాంతండాకు చెందిన భుక్యా సంతోష్ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగ కోసం భార్య అనూష (28), కూతుళ్లు ప్రాణిస్విని, చైత్ర (7)తో కలిసి గ్రామానికి వెళ్లాడు. పండుగ ముగియడంతో గురువారం తన భార్యాపిల్లలతో పాటు, అక్కబావలు భవాని, రవి, వారి కూతురు మోక్షతో కలిసి కారులో అంబర్‌పేటకు బయలుదేరాడు.
ఉదయం 6.30 గంటల టైంలో భువనగిరి పట్టణ శివారులోని పెట్రోల్ బంక్ వద్దకు రాగానే లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారు ముందుభాగం పూర్తిగా లారీ కిందకు దూసుకెళ్లడంతో అనూష, చైత్ర అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న సంతోష్‌తో పాటు, ప్రాణస్విని, భవానీ, రవి, మోక్షకు గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని భువనగిరి జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. జేసీబీ సాయంతో కారును లారీ కింది నుంచి బయటకు తీశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్‌హెచ్‌వో సంతోష్‌కుమార్ తెలిపారు.